వారే తాపీ మేస్త్రులు.. కూలీలు.. సప్తపది ఆలయాన్ని నిర్మిస్తున్న ముస్లిం సోదరులు..

ఏపీలోని నెల్లూరులో రొట్టెల పండుగ గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ కుల, మతాల భేదముండదు. వాస్తవానికి ఇది ముస్లింలకు సంబంధించినది అయినా కూడా హిందువులంతా పాల్గొంటారు. ఇది సర్వమత సమ్మేళనానికి ప్రతీక. అలాగే చిత్తూరు జిల్లాలో ఓ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. తండ్రికి ఇచ్చిన మాట కోసం తనయులు ఆంజనేయ స్వామి సహా పలువురు దేవుళ్లతో కూడిన ఆలయాన్ని నిర్మిస్తారు. ఆ నిర్మించేది హిందువులైతే చెప్పుకోవాల్సిన పని లేదు.. ముస్లిం కుటుంబం. 14 ఏళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణాన్ని ముస్లిం సోదరులు చేపట్టారు.

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కె.కొత్తపేట గ్రామానికి చెందిన ఫిరోజ్, చాంద్ భాషా అన్నదమ్ములు తమ తండ్రి అజీద్ బాషా కోరిక తీర్చాలని భావించారు. వారిని తండ్రి అజీద్ బాషా.. ఆంజనేయ స్వామి సహా సప్తపది ఆలయాన్ని నిర్మించాలని కోరారట. తండ్రి కోరిక మేరకు ఆ ఆలయ నిర్మాణం చేపట్టారు. వారు హిందూ దేవతలను పూజించడం వెనుక కారణమేంటంటే.. అజీత్ బాషా తండ్రికి సంతానం లేకపోవడంతో ఎవరి సలహా మేరకో హనుమంతుడిని పూజించారట. ఫలితంగా అజీత్ భాషా జన్మించారట. అప్పటి నుంచి ఆ కుటుంబం ఆంజనేయ స్వామిని ఆరాధిస్తోందట. ఈక్రమంలోనే ఇప్పుడు ఆలయం నిర్మిస్తోంది. ఆ ఆలయాన్ని వారే తాపీ మేస్త్రులుగానూ.. కూలీలు గానూ మారి నిర్మిస్తున్నారు. దానిలో హనుమంతుడు, వినాయకుడు, శివుడు, సాయిబాబాలను ప్రతిష్టించామని.. దాతలెవరైనా విరాళం ఇస్తే మిగిలిన దేవతా విగ్రహాలను ప్రతిష్టిస్తామని చెబుతున్నారు.

Share this post with your friends