నేటి నుంచి కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో మహాకుంభాభిషేకం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి క్షేత్రం మహాకుంభాభిషేకానికి ముస్తాబైంది. సుమారు 42 సంవత్సరాల తర్వాత ఈ మహాకుంభాభిషేకం జరుగతోంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి మూడు రోజుల పాటు శత చండి మహారుద్ర సహస్ర ఘట్టాభిషేక, కుంబాభిషేక మహోత్సవాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ మహత్తర ఘట్టాన్ని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో కాళేశ్వరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది.

1982లో ముక్తేశ్వర స్వామివారికి మహాకుంభాభిషేకం జరిగింది. ఆ తరువాత తిరిగి మహాకుంభాభిషేకం జరగడం ఇదే తొలిసారి. మూడు రోజుల పాటు స్వామివారికి 1,180 కలశాలతో అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో పాల్గొనే భక్తులు కొందరు ముందుగా పుష్కరఘాట్‌లో స్నానమాచరిస్తారు. అనంతరం వచ్చి మహాకుంభాభిషేకంలో పాల్గొంటారు. దీనికోసం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ స్వామిపూజ నిర్వహించనున్నారు.

Share this post with your friends