ప్రయాగ్‌రాజ్.. 144 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళాకు వేదికగా మారింది. పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడకు వచ్చి స్నానమాచరిస్తున్నారు. మహా కుంభమేళా జరిగే ప్రయాగ్‌రాజ్ ప్రాంతం భూలోక ధామంగా ప్రసిద్ధి చెందింది. ప్రయాగ్‌రాజ్‌కు ఇప్పుడే కాదు.. కుంభమేళా లేని సమయంలో కూడా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి భక్తులు ఏడాదంతా వస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ విశిష్టతేంటో తెలుసుకుందాం. త్రేతాయుగంలో వనవాసం సమయంలో శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి ఇక్కడి భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించినట్లుగా చెబుతారు.
ఈ ఆలయ పురాణం ప్రాశస్త్యం ఏంటో తెలుసుకుందాం. ప్రయాగ క్షేత్ర ప్రాశస్త్యాన్ని మూడు పురాణాల్లో పేర్కొనడం జరిగింది. అగ్ని, మత్స్య, కూర్మ పురాణాలూ దీనిని విపులంగా వివరిస్తున్నాయి. క్షీరసాగర మధనంలో లభించిన అమృత భాండం తీసుకుని విష్ణువు అక్కడి నుంచి వెళుతున్నాడట. ఆ సమయంలో మార్గ మధ్యంలో హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్‌రాజ్ అనే నాలుగు ప్రదేశాలలో అమృత బిందువులు చిలకరించాడని.. అందుకే ఆయా ప్రదేశాల్లో మహాకుంభమేళ నిర్వహిస్తున్నారని ప్రతీతి. పద్మపురాణం ప్రకారం.. ప్రయాగ్‌రాజ్‌లో మాఘ స్నానం అత్యంత పవిత్రమైనదని సమాచారం.