1న ఒంటిమిట్ట ఏకశిలానగరంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఒంటిమిట్ట ఏకశిలానగరంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరుగనుంది. ఆలయంలో ఏప్రిల్ 05 నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన నిర్వహించి, ఉదయం 08 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడతారు. ఈ నేపథ్యంలో గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీగరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు.

అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 11.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు. శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయాన్ని ఏపీ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి 09.09.2015న తిరుమల తిరుపతి దేవస్థానం విలీనం చేసుకున్నది. ఈ ఏడాది శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 5న అంకురార్పణ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు శ్రీ పుష్పయాగం వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు టిటిడి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.

Share this post with your friends