
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు.
పరదాలు విరాళం :
ఈ సందర్భంగా ఆలయానికి హైదరాబాదుకు చెందిన శ్రీ స్వర్ణకుమార్ రెడ్డి ఆరు పరదాలు, రెండు కురాళాలు, తిరుపతికి చెందిన శ్రీ సుధాకర్, శ్రీ జయ చంద్రారెడ్డి, శ్రీ అరుణ్ కుమార్ నాలుగు పరదాలు 25 హుండీ వస్త్రాలు విరాళంగా జేఈవో శ్రీ వీరబ్రహ్మంకు అందించారు.
నవంబరు 28 నుంచి బ్రహ్మోత్సవాలు :
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుండి డిసెంబరు 6వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం నవంబరు 27వ తేదీన ఉదయం లక్ష కుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు ఆలయ మాడ వీధుల్లో వాహనసేవలు జరుగనున్నాయి.
