
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ బాలాజి ఆరోగ్య వరప్రసాదిని పథకానికి పెద్ద మొత్తంలో విరాళం అందింది. వైజాగ్‌కు చెందిన హిందూస్తాన్ అసోసియేట్స్ ఆదివారం రూ.20 లక్షలు విరాళం అందించింది. హిందూస్తాన్ అసోసియేట్స్‌కు చెందిన మస్తాన్ రావు ఈ విరాళం అందించారు. ఈ మేరకు దాత విరాళం డీడీని తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా దాతను అదనపు ఈవో అభినందించారు. అనంతరం మస్తాన్‌రావు శ్రీ మలయప్ప స్వామివారి దర్శనం చేసుకున్నారు.
కాగా.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే నారాయణగిరి షెడ్లలో ఆదివారం భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. నిద్రపోతున్న సమయంలో ఒక మహిళపై మరో మహిళ కాలు వేసిందనే కారణంతో ఇద్దరు మహిళా భక్తుల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. అది కాస్తా ముదిరి జుట్లు జుట్లు పట్టుకుని దాడి చేసుకునే వరకూ వెళ్లింది. ఈ క్రమంలోనే పురుషులు కూడా ఒకరినొకరు తోసుకున్నారు. తోటి భక్తులు సైతం పట్టించుకోకపోవడంతో గొడవ మరింత ముదిరింది. ఈ క్రమంలోనే సమీపంలోని సెక్యూరిటీ గార్డు వారిని సర్ది చెప్పి వివాదాన్ని సమసిపోయేలా చేశారు. నారాయణగిరి ఉద్యానవనంలోని 8వ నంబరు షెడ్‌లో ఆదివారం వేకువజామున 3.30 గంటల సమయంలో ఈ గొడవ జరిగింది.
