కొండగట్టుకు కాలినడకన హనుమాన్ మాలధారులు

హిందూ సంప్రదాయంలో హనుమంతుడికి ప్రత్యేక స్థానముంది. కార్యసిద్ధిని, సమస్యలను అధిగమిచే శక్తితో పాటు ధైర్యాన్ని ప్రసాదించే దేవుడిగా హనుమంతుడిని భక్తులు కొలుస్తారు. ప్రతీ ఊరులోనూ హనుమంతుడి ఆలయం తప్పనిసరిగా ఉంటుంది. హనుమాన్ ఆలయం లేని ఊరంటూ ఉండదంటే అది అతిశయోక్తి కాదు. అలాంటి రామభక్త హనుమాన్ జయంతి శ్రీరామనవమి తరువాత సరిగ్గా ఆరు రోజులకు వస్తుంది. కానీ ఆ ఒక్కరోజే కాదు.. ఆంజనేయుడి జయంతిని ఏడాదిలో రెండుసార్లు జరుపుకొంటారు. ఇప్పటికే మనం హనుమాన్ జయంతిని ఒకసారి జరుపుకున్నాం. రెండోసారి ఈ నెల 22న జరుపుకోనున్నాం.

ఈ నెల 22న హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్టులోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో పెద్ద ఎత్తున మాలధారులు మ మాల విరమణ చేయనున్నారు. ఈక్రమంలోనే సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన 51 మంది హనుమాన్ మాలధారణ చేసిన భక్తులు కాలినడకన కొండగట్టుకు బయలుదేరారు. దీనికి ముందు స్థానిక మిరుదొడ్డి శ్రీ సీతారామచంద్ర, ఆంజనేయస్వామి ఆలయాలలో ఇరుముడులు కట్టుకొని ప్రత్యేక పూజలతో పాటు పల్లకి సేవ నిర్వహించారు. జైశ్రీరాం, జై హనుమాన్ నినాదాలతో మాలదారులంతా కొండగట్టుకు కాలినడకన బయలుదేరారు. మిరుదొడ్డి నుంచి కొండగట్టుకు 90 కిలోమీటర్లు దూరం ఉంటుంది. గురుస్వామి ఆంజనేయులు జెండా ఊపి మాల ధారణ భక్తుల కాలినడకను ప్రారంభించారు.

Share this post with your friends