జన సంమోహనం మధ్య వైభవంగా గోవిందుడి రథోత్సవం

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6.15 గంటలకు ప్రారంభమైన రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. భక్తులు అడుగడుగునా టెంకాయలు కొట్టి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు.

ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో తత్త్వజ్ఞానమిదే. అనంతరం ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి, న‌మ్మాళ్వార్ల‌ వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. ర‌థోత్స‌వంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఎఫ్ఎ అండ్‌ సిఏవో శ్రీ బాలాజి, ఎస్ ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఇత‌ర ఇంజినీరింగ్ పలుశాఖల అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

Share this post with your friends