ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జనవరి 13వ తేదీ, పుష్యపౌర్ణమి రోజున ఘనంగా ప్రారంభమైంది. నాటి నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కుంభమేళాలో స్నానమాచరించేందుకు తరలివస్తున్నారు. ఇక్కడ సాధారణ ప్రజలే కాకుండా నాగసాధువులు సైతం పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ స్నానమాచరిస్తున్నారు. 144 ఏళ్లకోసారి వచ్చే ఈ కుంభమేళాలో తిరుమల తిరుపతి దేవస్థానం సైతం పాలు పంచుకుంటోంది. నమూనా శ్రీవారి ఆలయాన్ని ఏర్పాటు చేసి కుంభమేళాకు వచ్చే భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కలుగ చేస్తోంది.
ఇక మహాకుంభ మేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్‌లోని దశాశ్వమేధ ఘాట్‌లో అర్చకులు శుక్రవారం సాయంత్రం గంగా హారతి సమర్పించారు. ముందుగా శ్రీవారి నమూనా ఆలయం నుంచి శ్రీ శ్రీనివాస స్వామిని దశాశ్వమేధ ఘాట్ వద్దకు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణ నడుమ వేంచేపు చేసి గంగా నదీ తీరంలో హారతి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ వేణుగోపాల దీక్షితులు, డిప్యూటీ ఈవో గుణ భూషణ్ రెడ్డి, సుపరింటెండెంట్ శ్రీ గురు రాజ్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.