
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం జరిగిన అత్యంత వైభవోపేతమైన గజవాహనం సేవకు దేశం నలుమూలల నుంచి విచ్చేసిన కళాబృందాల ప్రదర్శనలు ప్రత్యేక శోభను తెచ్చిపెట్టాయి. ఈ రోజు వాహన సేవ రాజసానికి, ఐశ్వర్యానికి ప్రతీకగా నిలుస్తుంది, శ్రీమలయప్ప స్వామివారు భక్తులకు అభయమిస్తూ రాజఠీవితో ఊరేగారు. ఈ మహాద్భుత ఘట్టంలో మొత్తం 10 రాష్ట్రాల నుంచి 21 కళా బృందాలు పాల్గొన్నాయి. మొత్తం 463 మంది కళాకారులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన కళాకారులు గజేంద్రవైభవం, బంజారా నృత్యం ప్రదర్శించారు. తిరుపతి నుండి వచ్చిన బృందాలు మయూరనృత్యం, కోలాటం, గజేంద్రమోక్షం వంటి సాంప్రదాయ నృత్యాలను కళ్ళకు కట్టారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బృందం ప్రదర్శించిన ప్రసిద్ధ పేరిని నృత్యం అశేష భక్తజనాన్ని ఆకట్టుకుంది.
ఒడిస్సాకు చెందిన కళాకారుల ఒడిస్సీ నృత్య ప్రదర్శన శాస్త్రీయ కళా వైభవాన్ని చాటింది. తమిళనాడు నుంచి వచ్చిన కళాకారులు ప్రత్యేకంగా కంసాలి రుచిత, తమిళనాడు జానపదనృత్యం తో పాటు ఓయిలట్టం (పాండిచ్చేరి) ను ప్రదర్శించారు. కేరళ, రాజమండ్రి, మహారాష్ట్ర బృందాలు ప్రదర్శించిన డ్రమ్ము విన్యాసాలు సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. అరుణాచల్ ప్రదేశ్ నుంచి గాలొ నృత్యం, సిక్కిం నుంచి మరోని నృత్యం వంటి ఈశాన్య రాష్ట్రాల కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కీలుగుర్రాలు ప్రదర్శనతో పాటు, అష్టలక్ష్మి వైభవం భరతనాట్యం భక్తి పారవశ్యాన్ని కలిగించింది. గజవాహనం సేవ సందర్భంగా స్వామివారి ఊరేగింపులో దేశం నలుమూలల నుంచి వచ్చిన ఈ కళా బృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక వైభవం, ఈ బ్రహ్మోత్సవాల ఆధ్యాత్మిక శోభను, సాంస్కృతిక సమైక్యతను ఇనుమడింపజేసింది.
