
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8 నుంచి 17వ తేదీ వరకు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముందు ఫిబ్రవరి 4న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి సందర్భంగా అధిక సంఖ్యలో ఆలయాన్ని భక్తులు సందర్శించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆలయంలో పుష్కరిణిని శుభ్రం చేసి.. ఆకర్షణీయంగా పెయింటింగ్ వేయనున్నారు. ఆలయాన్ని విద్యుత్, పుష్పాలంకరణలతో శోభాయమానంగా మార్చనున్నారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆర్చ్‌లను తిరుపతి ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్లు, తాగునీరు, అన్నప్రసాదాలు అందించేందుకు వీలుగా సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పారిశుధ్యానికి పెద్దపీట వేస్తున్నారు. ఇక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు.
