
తిరుమలలో ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకూ జరుగనున్న నేపథ్యంలో టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలారావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజులతో పాటు టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణలతో కలిసి సోమవారం సాయంత్రం అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 24న బ్రహ్మోత్సవాల తొలి రోజు పట్టు వస్త్రాల సమర్పణ.
సెప్టెంబర్ 28న గరుడ సేవ, అక్టోబర్ 2న చక్రస్నానం.
రద్దీ నిర్వహణకు రద్దీని ముందుగా అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఈవో ఆదేశం.
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహన రాకపోకలను అంచనా వేసేందుకు టెక్నాలజీ సాయం తీసుకోవాలని ఆదేశం.
ఎక్కువమంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా చర్యలు చేపట్టాలని ఆదేశం.
ఆలయంలో, గ్యాలరీల్లో, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జిల్లా పోలీసులతో సమన్వయంతో భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈవో ఆదేశం.
తిరుమలలో పార్కింగ్ స్థలాలను ఎంపిక చేసి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం.
ఆలయ కైంకర్యాలు, వాహనసేవలు, ఇంజినీరింగ్ పనులు, వసతి గృహాలు, కల్యాణకట్ట, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, గార్డెన్ విభాగం అలంకరణలు, శ్రీవారి సేవకుల సేవలు, మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం, మే ఐ హెల్ప్ యూ సెంటర్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, టీటీడీ, ఏపీఎస్ఆర్టీసీ తరఫున రవాణా సదుపాయాలు, పార్కింగ్ ఏర్పాట్లపై సమగ్రంగా చర్చ జరిగింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సురక్షిత రవాణా..
శ్రీ మలయప్పస్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు సురక్షితమైన రవాణ కోసం ఘాట్ రోడ్లలలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన ఫూర్తి చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. అలిపిరి నుండి అప్ ఘాట్ రోడ్(రెండవ ఘాట్ రోడ్)లో జరుగుతున్న పనులను సోమవారం ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే ఘాట్ రోడ్డులో కాంక్రీట్ తో రీటైనింగ్ వాల్ నిర్మాణాన్ని పరిశీలించారు. అక్కడక్కడ తొట్టేలు ఏర్పాటు చేసి నీటితో నింపాలన్నారు. అదేవిధంగా పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేస్తూ అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు మరింత ఆహ్లాదం కలిగించే విధంగా పూల మొక్కలతో సుందరీకరించాలని, ఇందుకోసం అవసరమైన చోట భూమి చదువు చేసి తగిన పూల మొక్కలు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఘాట్ రోడ్లలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
