
నవరాత్రులలో అత్యంత పవిత్రమైన వాటిలో ఒకటి కుమారి పూజ. దీనినే కన్యాపూజ అని కూడా అంటారు. ఈ పూజను నిర్వహించడం వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. కన్యాపూజ నిర్వహించడం వలన ఆర్థిక సమస్యలు, కష్టాలు తొలగిపోతాయని, జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయట. ఈ పూజ ఎలా చేయాలి? ఏ వయసు వారు చేయాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నవరాత్రుల్లో కన్యా పూజను ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముందుగా ఈ పూజ కోసం 2 నుంచి 10 సంవత్సరాల బాలికను అమ్మవారి స్వరూపంగా భావించి ఇంటికి ఆహ్వానించాలి.
బాలికను ఒక పీటపై కూర్చోబెట్టి ఆమె పాదాలను నీటితో శుభ్రంగా కడిగి పాదాలకు పసుపు రాయాలి. అనంతరం పాదాలపై పూలు, సుగంధ ద్రవ్యాలను సమర్పించిన మీదట హారతి ఇవ్వాలి. పూజ తర్వాత బాలికకు కొత్త దుస్తులు పెట్టాలి. అనంతరం బాలికకు భోజనం పెట్టాలి. ముఖ్యంగా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం, అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే బాలికను బాల త్రిపురసుందరి దేవి భావించి అవన్నీ చేయాలట. ఈ పూజలో బాలిక వయసును బట్టి ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. దేవీ భాగవతం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
