రథసప్తమి అనగానే మనకు గుర్తొచ్చేది అరసవెల్లి సూర్యనారాయణ ఆలయం. ఈ ఆలయంలో పెద్ద ఎత్తున నేడు వేడుకలు ప్రారంభమయ్యాయి. రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం, అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజాము నుంచే వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సైతం స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. క్షీరాభిషేకం కోసం భక్తులు బారులు తీరారు.
మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనభాగ్యం లభించనుంది. సోమవారం రాత్రి నుంచే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ఆలయం 7వ శతాబ్దంలో కళింగ తూర్పు గంగా రాజవంశానికి చెందిన గొప్ప పాలకుడు రాజు దేవేంద్ర వర్మ నిర్మించారని నమ్ముతారు . ప్రస్తుత నిర్మాణం దాదాపుగా 18వ శతాబ్దంలో పునర్నిర్మించినదే కావడం గమనార్హం. ఈ ఆలయం ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం వంటి కళింగ వాస్తుశిల్పం యొక్క రేఖ దేవులా శైలిలో నిర్మించబడింది . ఈ ఆలయం భారతదేశంలోని పురాతన సూర్య దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.