సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లిలో కొలువైన వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 19న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 27 వరకూ కొనసాగనున్నాయి. ఈ క్రమంలోనే స్వామివారికి పెద్ద ఎత్తున వాహనసేవలు నిర్వహిస్తారు. రెండోరోజు ఉదయం భద్రకాళి సమేత వీరభద్రుడికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. దీనికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
అనంతరం స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన నందీశ్వర వాహనంపై ఊరేగాడు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మద్ది ప్రతాపరెడ్డి, ఈవో శశిధర్ గుప్తా, పర్యవేక్షకులు సోమయ్య, అర్చకులు, భక్తులు ఊరేగింపు సేవలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తొలిరోజున రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి ప్రత్యేక పూజలలో పాల్గొని వీరభద్ర స్వామికి అభిషేకం, భద్రకాళి అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. మాధవానంద సరస్వతి స్వామి వారికి ఆలయ కమిటీ ఛైర్మన్ మద్ది ప్రతాపరెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.