నేటి నుంచి ఆశ్వయుజ మాసం ప్రారంభం..

ఇవాళ్టి (మంగళవారం) నుంచి ఆశ్వయుజమాసం ప్రారంభమైంది. అన్ని మాసాల్లో ఆశ్వయుజ మాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆశ్వయుజ మాస విశిష్టత ఏంటంటే.. త్రిమూర్తుల దేవేరులైన సరస్వతి, మహాలక్ష్మీ, పార్వతీ దేవిలకు అత్యంత ప్రీతికరమైన మాసం — ఆశ్వయుజం. దేవీ ఆరాధనకు ఉత్కృష్టమైన కాలం ఇదే. జగన్మాత పార్వతీదేవి తొమ్మిది అవతారాల రూపంలో దర్శనమిచ్చిన మాసం. ఆయుర్వేదాధిదేవత ధన్వంతరి జన్మించిన మాసం. ద్వైతసిద్ధాంత ప్రవక్త శ్రీమధ్వాచార్యులు జన్మించిన పవిత్ర మాసం. నరకాసురుడు సంహారమై ప్రజలకు ఆనందోత్సాహం నింపిన మాసం ఇదే.

నవరాత్రుల వైభవం..

ఆశ్వయుజ శుద్ధ పక్షంలోని తొలి తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు. భక్తులు కలశాన్ని స్థాపించి, మూడు దేవులను మూలపుటమ్మగా పూజించాలి. అష్టమి, నవమి రోజుల్లో ప్రత్యేకంగా పూజించే వారికి శోకాలు దరిచేరవు. ప్రతి రోజు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం మంగళప్రదం. పూజలు చేయలేని వారు అమ్మవారి పటానికి గాని, విగ్రహానికి గాని పూజిస్తూ స్తోత్రపారాయణ చేయవచ్చు. ఇలా ఆరాధించినవారికి దేవి సంతృప్తురాలు అవుతుంది. దుష్ట శక్తులు, గ్రహపీడలు తొలగిపోతాయి.

Share this post with your friends