16న అష్టదళ పాదపద్మారాధన, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. కారణమేంటంటే..

తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 02వ తేది వరకు జరగనున్న నేపథ్యంలో సెప్టెంబర్ 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆ రోజు అష్టదళ పాద పద్మారాధన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. తమిళంలో, కోయిల్ అంటే ‘పవిత్ర పుణ్యక్షేత్రం’, ఆళ్వార్ అంటే “భక్తుడు”, తిరు అంటే “శ్రేష్ఠo”, మంజనం అంటే “స్నానం”. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గర్భగుడి మరియు ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం అని అర్థం.

ఈ శుద్ధి జరుగుతున్న సమయంలో శ్రీవారి ప్రధాన మూర్తిని ఒక తెల్లని వస్త్రంతో కప్పి ఉంచుతారు. అన్ని దేవతామూర్తులను, ఇతర వస్తువులను గర్భగుడి నుండి బయటికి తెచ్చి, కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ మొదలైన వాటితో కూడిన “పరిమళం” అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు. ఈ మొత్తం కార్యాచరణ ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటల వరకు ఒక మహా యజ్ఞంలా జరుగుతుంది. తర్వాత ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి, లోపల ఇతర పరివార దేవతలు, దీపం, పూజ వస్తువులను మరల లోనికి తీసుకొస్తారు . అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పిస్తారు.

ఈ యావత్ కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించబడుతుంది. కాగా సంవత్సరానికి నాలుగు సార్లు ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే మంగళవారం నాడు ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ.

సెప్టెంబర్ 16న వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు:

టీటీడీ సెప్టెంబర్ 16న వీఐపీ బ్రేక్ దర్శనాలను (ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా) రద్దు చేసింది. కావున సెప్టెంబర్ 15న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని భక్తులు గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది.

Share this post with your friends