
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి అవినీతి మరకలు ఇంకా చెరిగిపోలేదు. రావణ కాష్టంలా చీరల కుంభకోణం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా అమ్మవారి చీరల కుంభకోణంపై మరోసారి విచారణ కొనసాగుతోంది. ఏపీ దేవాదాయ శాఖ చీరల కుంభకోణంపై విచారణకు ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ క్రమంలోనే ఆ కమిటి తాజాగా ఇంద్రకీలాద్రికి చేరుకుని చీరల లెక్క తేలుస్తోంది. ఆలయంలోని ఫైల్స్ ఆధారంగా విచారణ ప్రారంభించింది. 2018-19 సంవత్సరంలో సుమారు 1.68కోట్ల విలువైన చీరలకు సంబంధించిన లెక్కల్లో అవకతవకలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే అప్పటి ఎగ్జిక్యూటివ్ అధికారి సురేష్‌బాబు.. ఆ విభాగానికి సంబంధించిన గుమస్తా సుబ్రహ్మణ్యంపై సస్పెన్షన్ వేటు వేశారు.
సురేష్‌బాబు తర్వాత ఈఓగా భ్రమరాంబ నియమితులయ్యారు. ఆమె కూడా చీరల స్కామ్ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. ఏఈఓ సుధారాణి విచారణలో చీరల లెక్కల్లో అవతకలున్నాయని స్పష్టమైంది. ఎన్ని చీరలు కనిపించకుండా పోయాయో లెక్క తేల్చి వాటి విలువను రూ.1.68 కోట్లుగా నిర్ధారించారు. ఆ డబ్బును తిరిగి కట్టించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలోనే అప్పట్లో సస్పెండ్ అయిన వారికి నోటీసులు జారీ చేశారు. గుమస్తా సుబ్రహ్మణం కోర్టును ఆశ్రయించడంతో మరోసారి నోటీసు ఇచ్చి సంజాయిషీ తీసుకోవాలని ఆదేశించింది. అయితే.. మారిన రాజకీయ పరిణామాలతో కొందరు పెద్దలను ప్రసన్నం చేసుకుని మళ్లీ విధుల్లో చేరిపోయారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి దుర్గ గుడిలో విచారణ ప్రారంభమైంది. మొత్తానికి ఏపీలో దుర్గ గుడి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
