
భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి కర్నూలు జిల్లాలోని మంత్రాలయం. రాఘవేంద్రస్వామి జీవసమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు నిత్యం ఇక్కడకు వస్తుంటారు. మారుమూల ప్రాంతమైన దీనిని అప్పట్లో మంచాల అని పిలిచేవారు. అప్పట్లో ఆదోని నవాబు దీనిని పాలించేవాడు. సన్యాసం స్వీకరించిన రాఘవేంద్ర స్వామి అక్కడున్న మూల రాములను పూజిస్తూ, బోధనలు చేస్తూ ఆ ప్రాంతానికి వచ్చారు. అయితే రాఘవేంద్ర స్వామిని గత అవతారంలో శ్రీమహావిష్ణువు భక్తపరాయణుల్లో ఒకడైన ప్రహ్లాదుడుగా పేర్కొంటారు.
ఆ సమయంలో ప్రహ్లాదుడు యజ్ఞాలు, యాగాలు చేసిన స్థలం మంత్రాలయమని గాథ. పూర్వవతారంలో రాజుగా తాను పాలించిన స్థలం కావడంతో ఇక్కడే తాను బృందావనస్థులు (జీవ సమాధి) కావాలని స్వామి తలచారని చెబుతారు. అయితే రాఘవేంద్రస్వామిని మంచాలమ్మ అనే గ్రామదేవత ఇక్కడే ఉండాలని ఆజ్ఞాపించడంతో స్వామి ఇక్కడే ఉంటూ చివరకు ఇక్కడే బృందావనస్థులు అయ్యారు. అప్పటి నుంచి నిత్యం రాఘవేంద్రస్వామి మూల బృందావననానికి పండితులు మంత్రాలు వల్లిస్తూ ఉండేవారట. కాలక్రమంలో మంచాల కాస్తా మంత్రాలయంగా మారిందట. ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని ఆ తరువాత రాఘవేంద్రుడిని దర్శించుకుంటారు.
