
ఆషాఢంలో తెలంగాణలో పెద్ద ఎత్తున బోనాల పండుగను జరుపుకుంటారు. జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆదివారం వచ్చిందంటే.. ఒక్కో ప్రాంతంలో బోనాల పండుగ జరుగుతుంది. పాతబస్తీలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడ కూడా బోనాలకు ఏమాత్రం లోటుండదు. పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతాయి. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం సుమారు నూట పదిహేడు క్రితం నిర్మించారు.
ప్రస్తుతం లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే అమ్మవారిని నిత్యం వివిధ రూపాల్లో అలంకరించి పూజలు నిర్వహించనున్నారు. ఇవాళ అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన శిఖర పూజ, ధ్వజారోహణం కార్యక్రమంలోనూ సీవీ ఆనంద్, కర్ణన్ పాల్గొన్నారు. ఆ తరువాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఉత్సవాలను ప్రారంభించారు.
