
మొత్తానికి యమ దూతల సందేహాలన్నింటినీ విష్ణు దూతలు తీర్చేసి అజామిళుని విష్ణు లోకానికి తీసుకెళ్లేందుకు వారు సిద్ధమయ్యారు. అయితే విష్ణు దూతలు, యమ దూతలకు మధ్య జరిగిన సంభాషణంతా విన్న అజామిళుడు ఆశ్చర్యపోవడమ కాకుండా సంతోష భరితుడయ్యాడు. పుట్టినప్పటి నుంచి నేటి వరకూ తాను ఒక్క రోజు కూడా నారాయణడికి పూజ చేసింది లేదని విష్ణు దూతలకు చెప్పాడు. అంతే కాకుండా తాను బ్రాహ్మణత్వం వీడి కులభ్రష్టుడనై నీచ కులకాంతలతో సంసారం చేశానని వెల్లడించాడు.
చిట్టచివరకు తన కుమారునిపై గల ప్రేమతో ‘నారాయణ’ శబ్దమును పలికినందుకు తనకు వైకుంఠప్రాప్తి కలిగిందని సంబరపడ్డాడు. తానెంత అదృష్టవంతుడినని పొంగిపోయాడు. తన పూర్వజన్మ సుకృతము, తన తల్లిదండ్రుల పుణ్యఫలమే తనను రక్షించిందని పేర్కొన్నాడు. సంతోషముగా విష్ణుదూతల విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లిపోయాడంటూ వశిష్టుల వారు కథను ముగించారు. అనంతరం జనక మహారాజుతో తెలిసిగాని, తెలియకగాని కార్తిక మాసంలో నారాయణ నామం జపించిన యెడల సకల పాపములు నశించుటయేగాక మోక్షమును పొందెదరని వశిష్టుల వారు వెల్లడించారు.
