జగద్ధాత్రి అమ్మవారిని పురుషులు చీరలు ధరించి పూజించడం వెనుక కథేంటంటే..

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని జగద్ధాత్రి అమ్మవారి గురించి తెలుసుకున్నాం కదా.. అక్కడ పెద్ద ఎత్తున పండుగను నిర్వహిస్తున్నారు. ఇలా అక్కడ 300 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ పూజలో పూజింపబడే దేవతను కొన్ని చోట్ల ‘రాణిమా’ అని.. మరికొన్ని చోట్ల ‘బురిమా’ అని పిలుస్తారు. కాగా భద్రేశ్వర్‌లోని 232 ఏళ్ల సాంప్రదాయం పాత టెంటులతల బార్వారిజగద్ధాత్రి పూజ. ఇక్కడ జరిగే పూజను దర్శించుకోవడానికి ప్రతీ ఏడాది లక్షలాది మంది భక్తులు వస్తారు. బురిమా పూజకు ముందు బురిమాను చీరతో అలంకరించే ఆచారం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ అమ్మవారి అలంకరణ చూసేందుకే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వస్తారు.

బురిమా పూజ ఇంత గొప్పగా చేయడానికి ఓ చారిత్రక నేపథ్యం ఉంది. నదియా రాజు కృష్ణచంద్రకు కూడా ఈ పూజతో సంబంధం ఉందని చెబుతారు. తొలిసారిగా ఈ పూజ అతని దివాన్ సూర్ చేతుల మీదుగా ప్రారంభమైందని చెబుతారు. ముందుగానే దివాన్ తన ఇంట్లోనే జగద్ధాత్రి పూజను ప్రారంభించారట. దివాన్‌కు ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ వితంతువులవడంతో దివాన్ దగ్గరే ఉండేవారు. కృష్ణచంద్ర అనుమతితో వారిద్దరే తమ ఇంట్లో జగద్ధాత్రి పూజ ప్రారంభించారు. ఈ వ్యక్తిగత పూజ కాస్తా కాలక్రమంలో బార్వారి పూజగానూ ఆపై.. టెంటులతల బార్వారి అని పేరు వచ్చింది. అనంతర కాలంలో దివాన్ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో ఇంటి పూజ వీధి పూజగానూ.. అది కాస్తా బర్వారీ పూజగా మారింది. అప్పట్లో స్త్రీలంతా ముసుగులోనే ఉండేవారు. మేలి ముసుగు ఎత్తడంపై కఠినమైన నిషేధం ఉండటంతో అమ్మవారి పూజ ఎవరు నిర్వహించాలనేది సమస్యగా మారిందట. అప్పుడు పురుషులు స్త్రీల మాదిరిగా చీరలు కట్టుకుని అమ్మవారికి స్వాగతం పలికేవారు. అప్పటి నుంచి పురుషులు చీర ధరించి అమ్మవారికి పూజలు నిర్వహించే ఆచారం వచ్చింది.

Share this post with your friends