సుచీంద్రంలో హనుమ తోకకు వెన్నపూస రాయడం వెనుక కథేంటంటే..

సుచీంద్రంలో హనుమంతుడు ఎంత మహిమాన్వితుడనేది ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని అతి తక్కువ ఆంజనేయుడి ఆలయాల్లో సుచీంద్రం కూడా ఒకటి. ఈ క్షేత్రంలో 18 అడుగుల హనుమంతుడి విగ్రహం కొలువుదీరి ఉంటుంది. ఈ విగ్రహాన్ని చూడాలంటే కొంచెం దూరానికి వెళ్లి మాత్రమే చూడాలని చెబుతారు. ఈ హనుమంతుడు చాలా మహిమాన్వితుడని అక్కడి వారంతా చెబుతారు. ఇక్కడి హనుమ అనుగ్రహం కోసం సింధూర పూజ, తమలపాకుల పూజ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఆంజనేయ స్వామి వారి తోకకు వెన్నపూస రాస్తే చాలు అనుకున్నది నెరవేరుతుందట.

అసలు తోకకు వెన్నపూస రాయడమేంటి? అనిపిస్తోంది కదా.. ఆ కథేంటో తెలుసుకుందాం. రామాయణంలోని సుందరకాండలో సీతమ్మను వెదుకుతూ లంకకు వెళతాడు. అక్కడ సీతమ్మను కలిసిన తర్వాత హనుమను రాక్షసులు బంధిస్తారు. అనంతరం రావణాసురుని వద్దకు తీసుకెళ్లగా.. హనుమంతుడు దూతగా వచ్చాడు కాబట్టి ధర్మం కాదు. అందుకే హనుమ తోక కు నిప్పు పెట్టమని రావణాసురుడు ఆజ్ఞాపించడంతో నిప్పు పెడతారు. హనుమ తోకకు నిప్పు పెట్టారని తెలుసుకుని సీతమ్మ అగ్ని దేవుడిని ప్రార్థించడంతో ఆ నిప్పు ఆయనను బాధించదు.

అప్పుడు హనుమంతుడు లంకా నగరమంతా నిప్పు అంటిస్తాడు. అనంతరం హనుమ సముద్రాన్ని దాటి శ్రీరాముడు, వానర సైన్యం విడిది చేసిన ప్రాంతానికి తిరిగి వచ్చాడు. ఆ ప్రాంతమే ఇప్పటి సుచీంద్రమట. అగ్ని హనుమను బాధించకపోయిన హనుమ తోక మాత్రం కొంతమేర కాలిపోవడంతో వానరులు ఆయనకు ఉపశమనం కలిగించడం కోసం తోకకు వెన్నపూస రాశారు. అప్పటి నుంచి ఈ ఆలయానికి వెళ్లిన భక్తులంతా హనుమంతుడి తోకకు వెన్నపూస రాసి వస్తారు. అలా చేస్తే ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ఆంజనేయుడు ప్రసాదిస్తాడని నమ్మకం.

Share this post with your friends