పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నారికేళ దీపాన్ని కార్తీకమాసంలో ప్రదోషకాలంలో అంటే సాయంకాలం ఇంట్లోని పూజ మందిరింలో వెలిగించాలని తెలుసుకున్నాం కదా. ఈ నారికేల దీపాన్ని వెలిగించే సమయంలో పాటించాల్సిన విధివిధానాలేంటో కూడా తెలుసుకుందాం. ముందుగా పూజా మండిరాన్ని అలంకరించుకుని పరమేశ్వరుడి చిత్రపటం లేదా లింగ స్వరూపానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. శివుడి చిత్రపటం ముందు పీట ఏర్పాటు చేసుకుని దానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పళ్లెంను ఉంచాలి. ఆ పళ్లెంకు ఐదు చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి.
ఆ తర్వాత ఓ చిన్న ప్లేట్లోకి గంధం తీసుకుని దానిలో గంగాజలాన్నిపోసి కలపాలి. తడి గంధాన్ని ఉంగరం వేలి ముంచి పళ్లెంలో స్వస్తిక్ రాసి దానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ స్వస్తిక్‌పై బియ్యాన్ని కుప్పలా పోసి ఓ కొబ్బరికాయను తీసుకుని పసుపు నీళ్లతో శుభ్రం చేసి శివుడి ముందు కొట్టాలి. ఆ రెండు కొబ్బరి చిప్పలను పళ్లెంలోని బియ్యంపై పెట్టి ఒక కొబ్బరి చిప్పకు ఐదు చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తరువాత దానిలో ఆవు నెయ్యి లేదంటే నువ్వుల నూనె పోసి రెండు వత్తులను ఒక వత్తిగా చేసి అలా మూడు వత్తులను చేసి వాటిని కొబ్బరి చిప్పలో తూర్పు, ఉత్తరం, ఈశాన్యం వైపు వేయాలి. ఆ తర్వాత ఏకహారతి లేదా అగరబత్తీతో వెలిగిస్తూ “దారిద్య్ర దుఃఖ దహనాయ నమః శివాయ” అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఆపై ఏదైనా తీపి పదార్థాన్ని మరో కొబ్బరి చిప్పలో నైవేద్యంగా వేసి అక్షితలు వేసి హారతి ఇవ్వాలి.