నామక్కల్ హనుమాన్ ఆలయ చరిత్ర ఏంటంటే..

తమిళనాడు నామక్కల్‌లోని దేవాలయానికి సుమారు 1500 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. నామక్కల్ కోట దిగువ భాగంలో ఉన్న నరసింహ స్వామి ఆలయానికి సుమారు వంద మీటర్ల ఎదురుగా హనుమాన్ ఆలయం ఒక ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. నామక్కల్ హనుమాన్‌గా ఈ ఆంజనేయుడు ప్రఖ్యాతిగాంచాడు. రెండు చేతులు జోడించి లక్ష్మీ నృసింహ స్వామి, సాలగ్రామం వైపు తిరిగి నమస్కరిస్తున్న భంగిమలో ఆంజనేయుడు ఉంటాడు. నామక్కల్ దుర్గాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. దీనిని రామచంద్ర నాయకర్ నిర్మించారు. ఈ కోటకు ఇరువైపులా గుహలుంటాయి.

కోటకు ఇరువైపులా ఉన్న గుహలలో నరసింహ స్వామి, రంగనాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఈ విగ్రహాలను కొండరాయితో మలిచారు. అందుకే నేటికీ ఇవి చెక్కు చెదరలేదు. ఈ కొండలలో ఎనిమిది కొలనులు.. వాటిలో విరిసిన తామర పువ్వులు ఉండడం విశేషం. ఈ ఆలయంలో ఉదయం 8:00 గంటలకు కలసంధి , మధ్యాహ్నం 12:00 గంటలకు ఉచికల పూజ, సాయంత్రం 6:00 గంటలకు సాయరక్ష , రాత్రి 8:45 గంటలకు అర్ధజామ పూజ నిత్యం నిర్వహిస్తారు. ప్రతి ఆచారానికి అలంకారం, నైవేద్యం, దీప ఆరాధన అనే మూడు దశలు ఉంటాయి. తమిళనాడులోని నామక్కల్ జిల్లా నుంచి సేలంకు వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంటుంది. దీనికి తమిళనాడులోని అన్ని జిల్లాల కేంద్రాల నుంచి రవాణా సౌకర్యం ఉంటుంది.

Share this post with your friends