సృష్టికి పరమేశ్వరుడు లయకారుడిగా చెబుతారు. ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్న శివయ్యకు కార్తిక మాసం చాలా ప్రత్యేకమైనది. ఈ మాసంలో శైవక్షేత్రాలను పెద్ద ఎత్తున భక్తులు సందర్శించుకుంటూ ఉంటారు. ఇలా చేస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయని చెబుతారు. మహేశ్వరుడు పంచ భూత లింగాలుగా, ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వెలసిన క్షేత్రాలు భువిపై పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శివుడు మంచు కొండల్లో వెలసి ఉన్న పంచ కేదారాలు మరో ఎత్తు. అలాంటి పంచ కేదారాల గురించి తెలుసుకుందాం.

పంచ కేదారాల దర్శనం అత్యంత శుభకరమని చెబుతారు. పరమేశ్వరుడి శరీర భాగాలు ఐదు ప్రదేశాల్లో పడ్డాయట. అవి మంచుకొండల నడుమ పడిపోయాయట. ఆ ఐదు ప్రాంతాలు పంచ కేదారాలుగా విరాజిల్లుతున్నాయి. వీటిని కైలాస క్షేత్రాలుగా కూడా పిలుస్తారు. మంచు శిఖరాలు, గలగల పారే జలపాతాలతో ప్రకృతి సోయగాల నడుమ ఉన్న ఉత్తరాఖండ్.. దేవతలు నడయాడిన నేలగా చెబుతారు కాబట్టి ఇది దేవభూమిగా పేరుగాంచింది. అలాంటి నేలపై శివుడు ఐదు చోట్ల కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. వీటినే పంచకేదారాలుగా పిలుస్తారు.
