కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వెలసిన తిరుమలను కలియుగ వైకుంఠంగా ఖ్యాతి చెందింది. తిరుమల శ్రీ మలయప్ప స్వామివారిని దర్శించుకుంటే ఏది అనుకుంటే అది జరుగుతుందని నమ్మకం. తిరుమల ఆనంద నిలయంలో కొలువుదీరిన శ్రీనివాసుడు ఒక చేతిని తన వద్దకు వచ్చే భక్తులకు తానున్నానే అభయం ఇస్తున్నట్టుగా పెట్టి.. మరో చేతిని తన పాదాల వైపు చూపిస్తున్న భంగిమలో దర్శనమిస్తాడు. అంటే తన పాదాలను ఆశ్రయించిన వారిని తానెప్పుడూ కాపాడతానని అభయం ఇస్తున్నట్టే. మరి ఆ శ్రీనివాసుడి పాద వైభవం ఏమిటో తెలుసా? ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆనంద నిలయంలో శ్రీనివాసుని ఆమూలాగ్రం దర్శించడమంటే, ఇక ఈ జన్మకు కావల్సింది మరొకటి లేదని భక్తులు భావిస్తూ ఉంటారు. శ్రీ మలయప్ప స్వామివారిని ఒక్కసారైనా శిరసాగ్రం నుంచి పాదాల వరకూ దర్శించుకోవాలి. అలా వారంలో ఒక్కరోజు మాత్రమే సాధ్యమవుతుంది. అదే నిజపాద దర్శం. ఒకవేళ నిజరూప దర్శనం చేసుకోలేకపోయినా కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు స్వామి పాదాలను మాత్రం తప్పకుండా దర్శించుకోవాలి. సాక్షాత్తు బ్రహ్మ కడిగిన పాదాలవి. శ్రీవారి పాద దర్శనం అన్ని వేళలా సాధ్యపడదు. కేవలం సుప్రభాత సమయంలో మాత్రమే సాధ్యమవుతుంది. మిగిలిన సమయాల్లో పుష్పాలు, తులసితో నిండి ఉంటాయి.
