కేరళలోని కొడుంగల్లూర్ గ్రామంలో ఉన్న భగవతి అమ్మవారి ఆలయం మలబార్‌లోని 64 భద్రకాళి ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి గాంచింది. ఈ ఆలయాన్ని శ్రీ కురుంబా భగవతి ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు 8 చేతులతో ఉగ్ర స్వరూపంలో దర్శనమిస్తుంది. ఒక చేతిలో రాక్షసుడి మొండెం, మరొక చేతిలో గంట, ఇంకో చేతిలో కత్తి పట్టుకొని ప్రచండ రూపంలో ఉంటుంది. ఈ ఆలయంలో నిత్యం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విశేషమైన పూజలు జరుగుతాయి. పూర్వం ఇక్కడ మహా శివుడి ఆరాధన జరగ్గా… పరశురాముడు మహాకాళికాదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించినట్టుగా చెబుతారు. ఈ తరువాత కాలంలో శంకరాచార్యులు 5 శ్రీ చక్రాలను ప్రతిష్టించి దేవత శక్తిని ఇందులో నిక్షిప్తం చేసినట్టుగా చెబుతారు. ఆ ఆలయంలో భరణి పండుగ ప్రధానమైనది. మార్చి ఏప్రిల్‌లో జరిగే ఈ పండుగ మూడల్ అనే ఆచారంతో ప్రారంభమవుతుంది. ఈ ఆచారంలో మేకలకు బదులుగా కోళ్లను బలి ఇస్తుంటారు.

