గుడి ఒకచోట… భగవంతుడు మరోచోట వెలిసిన అద్భుత రహస్యం గండికోట–మైదుకూరు మాధవరాయ స్వామి చరిత్ర. గండికోట దుర్గంలో ఉన్న లక్ష్మీ మాధవరాయ స్వామి ఆలయంపై నవాబుల దాడుల సమయంలో, ఆలయ అవమానాన్ని తట్టుకోలేక స్వామి స్వయంగా గర్భగుడి వెనుక రంధ్రం చేసి సొరంగ మార్గం ద్వారా మైదుకూరులోని మాండవ్య క్షేత్రానికి చేరుకున్నాడని భక్తుల విశ్వాసం. అడవులతో నిండిన ఆ ప్రాంతంలోని ఒక బావి వద్ద స్వామి అజ్ఞాతంగా వెలసి… రోజూ ఒక మేక ద్వారా పాలు స్వీకరించేవారట. ఒకరోజు గొర్రెల కాపరి స్వామికి పాలు ఇచ్చే మేక తలపై కొట్టగా.. ఆ కర్ర స్వామికి తగిలి నుదిటిపై గాయం ఏర్పడింది. ఆ సమయంలో స్వామి స్వయంగా పలికిన దివ్యవాణి ఊరంతా సంచలనం కలిగించింది. అప్పుడు భక్తులు స్వామిని గుర్తించి ఆలయం నిర్మించి ప్రతిష్ఠించారు. నేటికీ స్వామి నుదిటిపై గాయం మచ్చ అలాగే ఉండిపోయింది. నాటి దివ్యలీలకు సాక్ష్యంగా నిలుస్తోంది.

