రామేశ్వరంలోని క్షేత్ర విశేషాల గురించి తెలుసుకున్నాం కదా.. ఇక్కడ రెండు శివలింగాలు ఉంటాయి. ఒకటి సీతాదేవి ఇసుకతో తయారు చేసిన సైకత లింగమైతే.. మరొకటి శ్రీరాముడు.. ఆంజనేయుడిని పంపించి హిమాలయాల నుంచి తెప్పించిన లింగం. దీనిని విశ్వలింగంగా పిలుస్తారు. రామేశ్వర క్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా విశ్వ లింగాన్ని పూజించాలని శ్రీరాముడు ఆదేశించినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అందుకే ముందుగా రామేశ్వరం వచ్చిన భక్తులంతా విశ్వలింగాన్ని పూజిస్తారు.

ఆలయ విశేషాలు ఏంటంటే.. ఈ ఆలయాన్ని ద్రవిడ సంప్రదాయంలో నిర్మించారు. ఆలయం చుట్టూ పెద్ద ప్రహరీ గోడతో పాటు ఆలయ గోపురాలు సైతం ఎంతో ఎత్తుగా ఉంటాయి. నాటి నిర్మాణ శైలి ఆలయంలో అడుగడుగునా మనకు కనిపిస్తుంది. ఈ ఆలయానికి లోపల భాగాన నిర్మించిన నడవాలు మరో ప్రత్యేకత. ఇవి ప్రపంచంలోనే అతి పొడవైన కారిడార్లుగా ప్రఖ్యాతిగాంచాయి. ఆలయం ప్రాంగణంలో ఉత్సవ మూర్తుల కోసం అతి పెద్ద మండపం ఉంటుంది. దీనిని చొక్కటన్ మండపం అని పిలుస్తారు. ఈ మండపం చదరంగం ఆకారంలో ఉండడం వల్ల ఈ పేరు వచ్చిందని అంటారు.
