అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయ చరిత్రతో పాటు ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. ఆలయ స్థల పురాణం ప్రకారం.. 1891లో కిర్లంపూడి జమీందారులు అన్నవరం ఆలయాన్ని నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఈ ఆలయం రెండస్థులతో నిర్మితమైంది. ఈ ఆలయం చాలా ఆకట్టుకునేలా ఉంటుంది. రథాకారంలో ఉండి, సూక్ష్మంగా పరిశీలిస్తే నాలుగు దిక్కుల్లో నాలుగు చక్రాలున్నట్లుగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని అగ్ని పురాణంలో సైతం చూడవచ్చు. అన్నవరం సత్యదేవుని ఆలయంలో మహిమాన్వితమైన మహా యంత్రం ఉంటుంది.

అలాగే సమయాన్ని సూచించే సూర్య స్తంభం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సత్యదేవుని దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా మొదటి అంతస్తులో స్వామివారి పాదాలు ఉంటాయి. ఈ పాదాలను దర్శించుకున్న మీదట ఆలయ మూల స్తంభాన్ని దర్శించుకుంటారు. అనంతరం రెండో అంతస్తులోని గర్భగుడిలో సత్యనారాయణ స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడి గర్భాలయంలో ఆసక్తికరంగా ఒకే పీఠంపై సత్యనారాయణ స్వామితో పాటు అనంత లక్ష్మీదేవి అమ్మవారు, పరమేశ్వరుడు వెలసి ఉండడం విశేషం. శ్రీహరి రూపమైన సత్యనారాయణ స్వామి.. సత్యానికి సాక్షిగా నిలుస్తాడు.
