తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన కుండలేశ్వర స్వామి వెలిశాడు. దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. వ్యాస మహర్షి ఇక్కడి గోదావరి నదికి ఓ వరమిచ్చాడు. అదేంటంటే.. ఈ నదికి నిత్యం పుష్కరాలు వస్తాయని వరమిచ్చాడు. అయితే మనమంతా మన పాపాలు తీరాలని కాశీకి వెళ్లి గంగలో మునిగి వస్తుంటాం. దీంతో మన పాపాలన్నింటినీ స్వీకరించి గంగమ్మ కలుషితమైపోతుంది. కాబట్టి నిత్యం గంగమ్మ రాత్రి పూట ఇక్కడి వృద్ధ గౌతమి నదికి వచ్చి స్నానమాచరించి.. భక్తుల ద్వారా తనను అంటిన పాపాలను ప్రక్షాళన చేసుకుని వెళుతూ ఉంటుందట.

ఏ నది అయినా చివరకు కలిసేది సముద్రంలోనే. అయితే ఇక్కడి వృద్ధ గౌతమికి మాత్రం సముద్రుడే ఎదురెళ్లి రెండు కుండలాలను బహుకరించాడని చెబుతారు. అందులో ఒక కుండలం శివ స్వరూపంగానూ.. గోదావరి నదీ గర్భంలో అదృశ్యంగా ఉంటుందట. నిత్యం సముద్ర గర్భంలో శివ స్వరూపంగా ఉన్న కుండలేశ్వరునికి బ్రాహ్మీ ముహూర్తంలో నారదాది మునీంద్రులు, దేవతలూ, యక్ష, కిన్నెర కింపురుషులు వచ్చి సముద్ర గర్భంలో పూజ చేసుకుని తరిస్తారు. దేవతలు కుండలేశ్వరుని సేవించుకునే సమయంలో వేదపారాయణ చేస్తారని కూడా చెబుతారు. మనం ఈ క్షేత్రానికి వెళ్లి ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసుకుంటే ఈ వేదఘోష ఇప్పటికీ వినవచ్చు.
