తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో దేశంలోనే ఎత్తైన గణపతి కొలువుదీరాడు. ఈ గణపతిని గుండు గణపతి అని కూడా పిలుస్తారు. గుల్బర్గా రాజధానిగా పాలించిన పశ్చిమ చాణక్య రాజుల్లో ఒకడైన తైలంపుడు ఈ అరుదైన ఏకశిలా గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. అయితే ఈ ఆలయ నిర్మాణం గావిస్తున్న సమయంలో తైలంపుడి తండ్రి విక్రమాదిత్యుడు మరణించాడట. దీంతో ఆలయ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. అప్పటినుంచి ఈ భారీ వినాయకుడి విగ్రహం ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఆరుబయటే ఉంటుంది.

ప్రస్తుతం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాగా ఈ ప్రాంతాన్ని పిలుస్తున్నారు. అప్పట్లో ఇది బాదామి రాజ్యంగా ఉండేది. ఈ విగ్రహం గురించి తెలుసుకున్న కొందరు చరిత్రకారులు చాలా ఏళ్ల క్రితం ఈ విఘ్నేశ్వరుడిని వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ తరువాత హైదరాబాద్కు చెందిన కొందరు స్వామివారి భక్తులు మందిర నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే మందిర నిర్మాణ నమూనాలను సైతం తయారు చేయించారు. అయితే అది ఎందుకోగానీ కార్యరూపం దాల్చలేదు. ఈ వినాయకుడి మాత్రం ఐశ్వర్య గణపతిగా నామకరణం చేశారు. ఆ తరువాత పుణెకు చెందిన ఓ ట్రస్ట్ సైతం ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చింది. ప్రధాన మందిరంతో పాటు, గుడి చుట్టూ 28 మందిరాలు నిర్మించాలని ప్రణాళికలు రచించారు కానీ అవి కూడా కార్యరూపం దాల్చలేదు.
