రామేశ్వరం క్షేత్రం గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నాం కదా. ఇదొక ద్వీపమని కూడా తెలుసుకున్నాం. అయితే ఈ ద్వీపంలో అనేక తీర్ధాలు ఉన్నాయి. ఒక్క రామనాథస్వామి ఆలయంలోనే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 22 తీర్ధాలు ఉండడం విశేషం. ఈ తీర్థాలన్నీ చిన్న చిన్న బావుల వలే ఉంటాయి కాబట్టి ఇక్కడకు వచ్చే వారంతా వీటిలోనే స్నానమాచరిస్తారు. ఈ 22 తీర్థాల్లో స్నానం చేస్తే తపస్సు చేసిన ఫలితం లభిస్తుందని నమ్మకం. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. సముద్రానికి సమీపంలో ఉన్నా కూడా ఈ బావుల్లోని నీరు మాత్రం తియ్యగా ఉండడం విశేషం.

అంతేకాదు.. ఆశ్చర్యకరంగా ఒక్కో బావినీరు ఒక్కో రుచితో ఉంటూ మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆలయానికి అతి సమీపంలోనే సముద్రం.. అది కూడా అలలు లేకుండా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. రామనాథస్వామి ఆలయ ప్రాంగణంలోని ప్రధాన మందిరంలో అరుళ్మిగు రామనాథస్వామి కొలువుదీరాడు. ఈ రామనాథస్వామే జ్యోతిర్లింగంగా విరాజిల్లుతున్నాడు. ఇక్కడ పార్వతీదేవి.. పర్వతవర్ధిని పేరుతో వెలసింది. అమ్మవారి ఆలయం కూడా రామేశ్వర క్షేత్ర ప్రాంగణంలోనే ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా విశ్వేశ్వరుడు, విశాలాక్షి, విష్ణుమూర్తి, మహాలక్ష్మి, సంతాన సౌభాగ్య గణపతి, నటరాజు, నవగ్రహ మండపం, వల్లీదేవసేన సమేత కార్తికేయుడు వంటి వివిధ దేవతా మూర్తులు సైతం ఈ క్షేత్రంలో కొలువుదీరారు.
