పాశాంకుశ (పాపాంకుశ) ఏకాదశి గురించి తెలుసా?

పాశాంకుశ ఏకదాశి లేదంటే పాపాంకుశ ఏకదాశి గురించి తెలుసా? ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ “ఆశ్వయుజ శుద్ధ ఏకాదశికి మరొక పేరు ఏమిటి? దాని ఫలితం ఏమిటి?” అని అడిగాడట.. అప్పుడు శ్రీకృష్ణుడు ఆనందంగా సమాధానంగా “ఓ ధర్మరాజా! ఈ ఏకాదశిని పాశాంకుశ లేదా పాపాంకుశ ఏకాదశి అని పిలుస్తారు. దీన్ని ఆచరించినవారికి సమస్త పాపాలు నశించి, అన్ని శుభఫలితాలు కలుగుతాయి. ఈ తిథి నాడు పద్మనాభ స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాదించాలి.” అని చెప్పాడు. ఈ వ్రతాచరణ వలన ధర్మార్థకామమోక్షాలు లభిస్తాయి. సకల తీర్థ స్నాన ఫలితాన్ని అందిస్తుంది. నరకయాతనలో ఉన్నవారు సైతం విముక్తి పొందుతారు.

శాస్త్రబోధ ఏంటంటే.. భగవంతుడిని అవమానించే వారు ఎన్ని వ్రతాలు చేసినా సత్ఫలితం పొందరు. ఈ ఏకాదశిని పాటించని వారు యజ్ఞాలు చేసినా ఫలితం రాదు. కాబట్టి శాస్త్రాలు “ఏకాదశి వ్రతం కన్నా గొప్పది లేదు” అని ఘోషిస్తున్నాయి. ఏకాదశి ఆచరణ ఏంటంటే.. ఉపవాసం, కృష్ణసేవ, హరినామ జపం, కథా శ్రవణం చేయాలి. రాత్రి జాగరణ ప్రత్యేక ఫలప్రదం. ఈ వ్రతాన్ని ఆచరించిన వారి పది తరాల పితృమాతృలు ఉద్ధరింపబడతారు. బాలులు, యువకులు, వృద్ధులు—ఎవరు అయినా ఈ వ్రతం పాటించవచ్చు. ఈ రోజున దానాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజున తిల, సువర్ణం, భూమి, జలం, గొడుగు, పాదుకలు దానం చేస్తే యమలోక నరకబాధలు ఉండవట. ఈ వ్రతాన్ని ఆచరించినవారు.. దీర్ఘాయుష్షు పొందుతారు. ధనధాన్య సమృద్ధితో సుఖంగా జీవిస్తారు. సర్వదోషాల నుంచి విముక్తి పొంది భగవత్ లోకానికి చేరుకుంటారట.

Share this post with your friends