ధన దీపం లేదా లక్ష్మీ దీపం గురించి తెలుసుకున్నాం కదా.. ఈ ధన దీపాన్ని వెలిగిస్తే మన ఇంట అష్టైశ్వర్యాలు నెలకొంటాయట. మరి ఈ ధనదీపాన్ని ఎలా వెలిగించాలో తెలుసుకుందాం. ధన దీపం వెలిగించడానికి ముందుగా పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆపై లక్ష్మీదేవి పటాన్ని గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకుని దానికి ముందు ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. ఈ పీటకు మూడు వైపులా పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి దానిపై గంధం, కుంకుమ బొట్లు పెట్టిన రాగి లేదా ఇత్తడి పళ్లెంను పెట్టి దానిలో బియ్యం పోయాలి.
బియ్యంలో కొద్దిగా పసుపు, కుంకుమ వేసి ఒక గులాబీ పువ్వు పెట్టాలి. అనంతరం రెండు చిన్న మట్టి ప్రమిదలను తీసుకుని వాటిని పూర్తిగా పుసుపు, కుంకుమ బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు రాగి లేదా మట్టి పళ్లెంలో ఉన్న బియ్యంలో ఒక మట్టి ప్రమిదను పెట్టాలి. ఆ ప్రమిదలో మూడు చొప్పున యాలకులు, లవంగాలు, కొద్దిగా రాళ్లు ఉప్పు వేసుకోవాలి. రెండో మట్టి ప్రమిదను తీసుకుని దానిపై మొదటి ప్రమిదను ఉంచాలి. దానిలో ఆవు నెయ్యి లేదంటే నువ్వుల నూనె పోసుకుని ఒత్తి వేసుకుని దాన్ని ఏక హారతి లేదంటే అగరుబత్తితో వెలిగించుకోవాలి. దీన్నే ధన దీపం లేదా లక్ష్మీదీపం అని పిలుస్తారు. ఈ దీపాన్ని ముఖ్యంగా గురు లేదా శుక్రవారం వెలిగిస్తే ఫలితం బాగుంటుందట. దీపం కొండెక్కిన తర్వాత దీపంలో వేసిన యాలకులు, లవంగాలు, రాళ్ల ఉప్పు, గులాబీ పువ్వును ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి.