
ప్రస్తుతం జంట నగరాల్లో బోనాల సందడి నడుస్తోంది. అసలెందుకు అమ్మవారికి బోనం సమర్పించాలి? ఈ సంప్రదాయం ఎలా వచ్చిందనే దానికి ఓ కథ ఉంది. ప్రతి సంవత్సరం సీతారాముల కల్యాణం చేసినట్టే శివ పార్వతుల కల్యాణం కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి ఆషాఢంలో పార్వతీదేవిని కొత్త పెళ్లి కూతురిగా భావించి పుట్టింటికి తీసుకొస్తాం. అమ్మవారికి మంచిగా భోజనం పెట్టి.. పసుపు, కుంకుమ, చీర పెట్టి మర్యాద చేస్తాం. అయితే చీర అనేది తప్పనిసరేమీ కాదు. పెట్టగల స్తోమత ఉంటేనే పెట్టాలి. అలాగే ఇంటికి వచ్చిన ఆడపడుచుతో చక్కగా మాట్లాడటం, గౌరవంగా చూసుకోవడం, కావల్సినవన్నీ అమర్చి పెట్టడం ప్రతి ఇంటా చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రతిగానే అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటాం.
ఈ క్రమంలోనే ఆషాఢంలో భక్తులంతా అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. కాస్త పెట్టగలిగిన వారు అమ్మవారికి బోనంతో పాటు చీరె, సారె, పసుపు, కుంకుమ, గాజులు వంటివి కూడా అందించి గౌరవించుకుంటారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి విషయానికి వస్తే కాస్త డిఫరెంట్. చాలా కాలం క్రితం హైదరాబాద్‌లో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు ఉజ్జయినిలో ఉన్న అమ్మవారికి ఓ వ్యక్తి మొక్కడంతో ప్లేగు వ్యాధి తగ్గిందట. దీంతో హైదరాబాద్‌లోనూ మహంకాళి అమ్మవారిని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. అప్పటి నుంచే ఈ అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆషాఢంలో బోనం సమర్పిస్తూ ఉంటారు.
