![]()
అధర్మం పెరిగిపోయిన ప్రతిసారీ శ్రీహరి ఏదో ఒక అవతారమెత్తి ధర్మసంస్థాపన గావిస్తాడని నమ్మకం. అలా శ్రీహరి దశావతారాలను ధరించాడు. వాటిలో మొదటిది మత్స్యావతారం. అసలు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎందుకు ధరించాల్సి వచ్చిందనేది తెలుసుకుందాం. కశ్యప మహాముని కుమారుడు హయగ్రీవుడు. రాక్షస రాజైన హయగ్రీవుడు దానవుల కంటే మానవులకు సద్గతులు కలగడాన్ని సహించలేకపోయాడు. దాని కోసం శోధించి వేదముల వలననే అలా జరుగుతోందని గ్రహించాడు. వెంటనే రాక్షస జాతిని ఉద్దరించేందుకు కంకణం కట్టుకున్నాడు. ఈ క్రమంలోనే బ్రహ్మదేవునికి శ్రీ మహావిష్ణువు అందించిన నాలుగు వేదాలను మానవులకు చెందనివ్వకూడదని భావించాడు.
అనుకున్నదే తడవుగా హయగ్రీవుడు నాలుగు వేదాలను అపహరించి సముద్రం అడుగునకు వెళ్లి దాక్కున్నాడు. బ్రహ్మదేవుడు వెళ్లి విష్ణుమూర్తికి విషయం చెప్పాడు. దీంతో శ్రీ మహావిష్ణువు మత్స్యావతారము ఎత్తి, సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుని సంహరించాడు. అనంతరం వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించాడు. ఆ నాలుగు వేదాలే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఈ నాలుగు వేదాలను పరమ పవిత్రమైనవిగా హిందువులంతా భావిస్తారు. ప్రపంచానికి ధర్మాధర్మాలను ఎలుగెత్తి చెప్పే పరమ పవిత్రమైన గ్రంథాలుగా హిందువులంతా వాటిని పరిగణిస్తారు. వేదాలను విష్ణుమూర్తి కాపాడినది శుద్ధ ద్వాదశి రోజు కాబట్టి నాటి నుంచి మత్స్య ద్వాదశిని జరుపుకుంటూ వస్తున్నాం.
