Site icon Bhakthi TV

భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం

వేసవి సెలవులు కావడంతో పాటు విద్యార్థులకు పరీక్షల ఫలితాలు వెలువడటంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. కొండపై భక్తులు దర్శనానికి బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలోనే భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై శుక్ర, శనివారాల్లో బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. జూన్ 30వ తేదీ వరకూ ఈ నిర్ణయం అమలు కానుంది. ముఖ్యంగా వీకెండ్స్‌లో రద్దీ మరింత పెరుగుతోంది. దీంతో సామాన్యుల దర్శనాలకు 30 – 40 గంటల పాటు పడుతోంది.

కాబట్టి సామాన్య భక్తులందరికీ త్వరితగతిన దర్శనావకాశం కల్పించేందుకు వీకెండ్స్‌లో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ మార్పును గమనించాలని భక్తులను టీటీడీ కోరింది. జూన్ 30వ తేదీ వరకూ తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను అనుమతించబోమని టీటీడీ వెల్లడించింది. ఈ మార్పును భక్తులంతా గమనించి సహకరించాలని కోరింది. ఇవాళ కొండపై క్యూ కాంప్లెక్స్‌లన్నీ భక్తులతో నిండిపోయాయి. రింగ్ రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకూ భక్తులు క్యూ కట్టారు. క్యూ కాంప్లెక్స్‌లు దాటి క్యూ దాదాపు 3 కిలోమీటర్ల మేర విస్తరించింది.

Share this post with your friends
Exit mobile version