Site icon Bhakthi TV

బ్రహ్మ రాతను తప్పించడం ఎవరి తరం కాదనడానికి ఈ కథే ఉదాహరణ

కాశీలో గంగా నది దగ్గర ఒక వ్యాపారి ఉండేవాడు. అతను నిత్యం స్నానం చేయడానికి గంగా నదికి వచ్చి స్నానం చేసి వెళ్ళేవాడు. అతనికి బ్రహ్మ రాసిన రాత చదివే విద్య తెలుసు. ఒకనాడు గంగా నది దగ్గర ఉన్న మర్రిచెట్టు దగ్గరలో నడుస్తుండగా కాలికి పుర్రె ఒకటి తగిలింది. దానిని చూసి,”ఛీ.. వెధవ పుర్రె ఇప్పుడే తగలాలా.. మళ్లీ స్నానం చేయాలి…” అనుకుంటూ పుర్రెని కాలితో తన్నబోయాడు. పుర్రె తళుక్కుమని మెరిసింది. అది చూసి, “దీని తలరాత ఏంటో చదువుదాం..” అని చేతిలోకి తీసుకుని చదివాడు. “వీడు జీవితాంతం కష్టపడతాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు చివాట్లు పెడతారు. బడిలో పంతుళ్ళు కొడతారు. పెళ్ళయ్యాక పెళ్ళాం తిడుతుంది. పిల్లలు పెద్దయ్యాక ఇంట్లోనుండి తన్ని గెంటేస్తారు. ప్రతిక్షణం ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే వుంటారు. డబ్బు నిలవదు.

ఎవరైనా దయతలచి ఇచ్చినా పోతుంది. బతికినంతకాలం కష్టాలు పడీ పడీ చస్తాడు. వీడు చచ్చిన అయిదు వందల సంవత్సరాలకి, వీడి పుర్రె ఒక స్త్రీ చేతిలో అవమానం పాలై మోక్షం పొందుతుంది..” అని ఆ పుర్రె మీద బ్రహ్మ తలరాత రాసివుంది. అది చదివి.. ‘‘బతికి ఉండగా అవమానం అంటే పర్వాలేదు. కానీ చచ్చాక కూడా పుర్రెకి అవమానం ఏంటి.. బ్రహ్మకి అసలు బుర్ర వుందా..” అని అనుకొని, ఆ పుర్రెని విసిరేయబోయి అసలు అవమానం ఎలా జరుగుతుందో చూడాలని అనుకొని దగ్గరలో ఉన్న మర్రిచెట్టు తొర్రలో ఆ పుర్రెని దాచాడు. నిత్యం స్నానం చేసే ముందు ఈ మర్రిచెట్టు తొర్రలో ఉన్న పుర్రెని చూసి పలకరించి వెళ్ళేవాడు. ఇలా కొన్నాళ్ళు గడచిన తరువాత బంధువుల ఇంట్లో వివాహం ఉంటే ఒక పది రోజులపాటు ఆ వివాహ మహోత్సవాలలో గడిపి వచ్చాడు. ఎప్పటిలాగానే స్నానానికి వెళ్తూ పుర్రె సంగతి గుర్తుకొచ్చి మర్రిచెట్టు దగ్గరికి వెళ్లి తొర్రలో ఉన్న పుర్రె కోసం చూస్తే, అది కనపడలేదు, వెతికాడు, దొరకలేదు.

మర్రిచెట్టు తొర్రలో దాచిన పుర్రె ఏమైపోయింది.. అని అనుకుంటూ స్నానం, సంధ్యా వందనం చేస్తున్నాడు. కాని మనసు మాత్రం పుర్రెమీదే వుంది. చేశాం.. అంటే చేశాం.. అన్నట్టు నిత్య కృత్యములు చేస్తూ ఉండగా, ఇది భార్య గమనించి, “మీరెందుకు ఇలా వున్నారో నాకు తెలుసులెండి..” అని అంది. నీకేం తెలుసని అడగ్గా.. “మీరు ఆలోచించేది మీ రెండో భార్య చనిపోతే, మర్చిపోలేక మర్రితొర్రలో దాచిన ఆవిడ పుర్రె గురించే కదా.. ఆ సంగతి నాకు ఎలా తెలుసనుకుంటున్నారా.. మీరు రోజు ఆ మర్రిచెట్టు తోర్రలో పుర్రెని చూస్తున్నారని జనాలు చెప్పుకుంటున్నారు..” అని భార్య అంది. “ఓహో.. ఇంతకీ ఏమి చేశావే దాన్ని..” అని భార్యని అడిగాడు.

“అది నా సవతి పుర్రె అని తెలిసి కోపం పట్టలేక ఇంటికి తీసుకొచ్చి వేడి వేడి నీళ్ళు మరగబెట్టి దానిమీద పోశాను. సలసలా కాగే నునె గుమ్మరించాను. అప్పటికి కసి తీరక కారం చల్లాను. అయినా కోపం తీరక రోట్లో వేసి రోకలిబండతో పచ్చడి కింద కొట్టి పిండి పిండి చేసి గంగలో కలిపాను..” అంది. భార్య చెప్పింది విని అతడు విస్తుబోయి అంతక్రితం జరిగింది అంతా చెప్పాడు. “ఒసేయ్ వెర్రి మొహమా.. అది నా పెళ్ళాం కాదే.. చచ్చాక కూడా ఆ పుర్రె అవమానం పాలై మోక్షం పొందుతుందని ఆ పుర్రె ముఖము మీద రాసి ఉంది. అది ఎలా నిజమౌతుందో.. చూద్దామని నేను ఆ మర్రిచెట్టు తొర్రలొ ఉంచాను. ఇదిగో నీవల్ల అవమానం పాలై గంగలో కలిసి మోక్షం పొందింది. గంగలో కలిస్తే మోక్షమే కదా..” అని భార్యతో అన్నాడు. ఆ విధంగా బ్రహ్మ రాసిన రాత నిజమైంది…

Share this post with your friends
Exit mobile version