Site icon Bhakthi TV

ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడి విశేషాలు అన్నీ ఇన్నీ కావు..

ఖైరతాబాద్ మహా గణపతి ఈ ఏడాది విశ్వశాంతి మహాశక్తిగా దర్శనమివ్వనున్నాడు. 69 అడుగుల ఎత్తుతో మట్టి గణపతి కొలువుదీరనున్నాడు. విగ్రహ పనులను గణేష్ విగ్రహ కమిటీ ప్రారంభించింది. ఆగస్ట్ 27న వినాయకచవితిని జరుపుకోనున్నాం. ఈ క్రమంలోనే విగ్రహ పనులను కమిటీ ప్రారంభించింది. కర్రపూజ నాడే విగ్రహ నమూనాను కమిటీ విడుదల చేసింది. మూడు తలలు, ఎనిమిది చేతులతో నిలుచున్న భంగిమలో వినాయకుడు కొలువుదీరనుండగా.. తలపై పడగవిప్పిన ఐదు సర్పాలు.. కుడివైపు చేతుల్లో ఆయుధం, సుదర్శన చక్రం, రుద్రాక్ష మాల, అభయ హస్తం ఉంది. ఎడమ చేతిలో పైనుంచి పద్మం, శంఖం, లడ్డూ ఉండనున్నాయి.

దిగువన ఒకవైపు పూరీ జగన్నాథుడు, మరోవైపు శ్రీ లలితా త్రిపుర సుందరీ విగ్రహాలతో పాటు హయగ్రీవస్వామి, గజ్జలమ్మ సైతం కొలువుదీరనున్నారు. 1954లో కేవలం ఒక అడుగుతో ఖైరతాబాద్ గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. నాటి నుంచి ఒక్కో అడుగు పెంచుకుంటూ ప్రస్తుతం 69 అడుగులకు చేరుకుంది. తొలినాళ్లలో ఖైరతాబాద్ వినాయకుడికి అంత క్రేజ్ ఉండేది కాదు.. పోను పోనూ పరిస్థితి మారిపోయింది. వినాయక చవితి అంటేనే ముందుగా ఖైరతాబాద్ గణేశుడి గురించి చెప్పుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. విగ్రహ నమూనాను కర్రపూజ నాడే విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఖైరతాబాద్ గణపతిని గతేడాది లక్షల మంది సందర్శించగా.. ఈ ఏడాది అంతకు మించి దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Share this post with your friends
Exit mobile version