
సికింద్రాబాద్‌లో మనకు తెలియని దేవాలయాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో నాగలోకాన్ని మరపించే నాగమ్మ దేవాలయం ఒకటి. ఇంత అద్భుతమైన దేవాలయం మరొకటి తెలంగాణలోనే లేదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ ఇప్పటికీ దేవతా సర్పమైన శ్వేతనాగు సంచరిస్తూ భక్తులకు దర్శనమిస్తుందని చెబుతారు. ఈ ఆలయం ఈనాటిది కాదు.. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయం. ఒకప్పుడు బ్రిటీష్ వారు యుద్ధానికి వెళ్లే సమయంలో ఈ ఆలయం అడ్డు ఉందని కూల్చేశారట. ఆ తరువాత ఆశ్చర్యకరంగా, మరుసటి శుక్రవారం నాడు బ్రిటిష్ అధికారి, అతని గుర్రం, పెంపుడు కుక్క ఆలయం ముందు చనిపోయి కనిపించాయట.
చాలా మంది రాహు, కేతు దోషాలతో పాటు పెళ్లి, సంతాన దోషాలు ఉంటాయి. అలాంటి వారు ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహిస్తే చాలు.. వాటిన్నింటిని నుంచి గట్టెక్కుతారని నమ్మకం. మూడు రోజుల పాటు దోషాలు కలిగిన వారు పూజ చేసిన నాగ ప్రతిష్ట చేస్తే దోషాలన్నీ మాయమవుతాయని చెబుతారు. ఈ ఆలయాన్ని జయలక్ష్మి నిర్మించారు. ఒకరోజు నాగదేవత ఈమె కలలోకి వచ్చి తనకు ఆలయం నిర్మించాలన ఆదేశించారు. దీంతో జయలక్ష్మి.. నాగదేవత ఆలయాన్ని నిర్మించారు. జయలక్ష్మి విగ్రహం కూడా మనకు ఆలయంలో కనిపిస్తుంది. హైదరాబాద్‌లోని ఆలయాలను సందర్శించాలనుకుంటే ఈ ఆలయాన్ని కూడా తప్పక సందర్శించండి.
