Site icon Bhakthi TV

అంతర్వేదిలో అత్యంత వైభవంగా రథయాత్ర

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీనృసింహస్వామి దివ్య క్షేత్రం శనివారం భక్తులతో నిండిపోయింది. శ్రీ లక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం రథయాత్ర పెద్ద ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం నీరాజనం పలికారు. నిన్న మధ్యాహ్నం 2.20 గంటలకు ఉత్సవమూర్తులను పల్లకీలో తీసుకొచ్చి రథంపై కొలువుదీర్చారు. తొలుత రథయాత్రకు ముందు ఆలయ ఛైర్మన్‌ కలిదిండి కుమార రామగోపాలరాజా బహద్దూర్‌ తదితరులు కొబ్బరికాయలు కొట్టారు.

అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 2.49 గంటలకు గోవింద నామ స్మరణతో భక్తులు రథాన్ని ముందుకు కదిలించారు. రథయాత్ర స్వామివారి సోదరి గుర్రాలక్క అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుంది. అక్కడ అమ్మవారికి చీర, సారె సమర్పించారు. అక్కడి నుంచి తిరిగి బయలుదేరిన యాత్ర 5.50 గంటలకు 16 కాళ్ల మండపం సమీపానికి చేరుకుని ఉత్సవమూర్తులను పల్లకీలో ఆలయానికి తీసుకెళ్లారు. ఈ రథయాత్రకు ముందు రోజు స్వామి, అమ్మవార్ల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. పాణిగ్రహణం, మాంగల్యధారణ, తలంబ్రాల ఘట్టం అత్యంత వైభవంగా జరిగింది.

Share this post with your friends
Exit mobile version