Site icon Bhakthi TV

అత్యంత వైభవంగా హిందువుల తొలి పండుగ..

హిందువుల మొదటి పండుగ తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి పర్వదినం నుంచే పండగలు ప్రారంభమవుతాయి. ఇప్పటి నుంచి వరసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఏకాదశి అత్యంత ముఖ్యమైన ఉపవాసాలలో ఒకటి. హవన యజ్ఞం, వేద ఆచారాల కంటే ఏకాదశి ఉపవాసం ఎక్కువ ఫలవంతమైనదిగా చెబుతారు. ఈ రోజున విష్ణువును పూజించి, ఉపవాసం ఉండటం ఆచారం.
హైందవ సంప్రదయంలో తొలి ఏకాదశి పండుగకి విశేషమైన స్థానముంది. దీన్నే శయని ఏకాదశి లేదా హరివాసరం లేదా పేలాల పండుగ అని కూడా పిలుస్తారు.

జూన్‌ 26 నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైంది. ఈ ఏడాది 2025 జులై 6వ తేదీన ఈ తొలి ఏకాదశి పండుగ జరుపుకోనున్నారు. ఏకాదశి అంటే 11 అని అర్థం. ఇందులో విశేషం అంటే ఏమిటంటే.. మనకుండే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు.. వీటన్నింటినీ కలిపి పనిచేయించే మనస్సు (అంతరేంద్రియం). ఈ 11 ఇంద్రియాలు ఏకోన్ముఖంగా శ్రద్ధతో శ్రీ మహావిష్ణువును స్మరించే సమయమే ఈ ఏకాదశి పండుగ. సాధారణంగా ఒక ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై సుమారు 4 నెలల పాటు శయనిస్తాడు. అనంతరం అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి (ప్రబోధినీ ఏకాదశి) రోజున శ్రీమహావిష్ణువు తిరిగి మేల్కొంటాడట. శ్రీ మహావిష్ణువు నిద్రించే ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా అభివర్ణిస్తారు.

Share this post with your friends
Exit mobile version