Site icon Bhakthi TV

శ్రీనివాసుడే తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట..

పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఈ ప్రకారం ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీవేంకటేశ్వరుడికి కన్యామాసం(ఆశ్వయుజం) లోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించార‌ట‌. అందువల్లే ఇవి ‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధి చెంది అప్పటి నుంచి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అక్టోబ‌రు 4 నుంచి 12వ తేదీ వ‌ర‌కు 9 రోజుల పాటు జ‌రుగ‌నున్న ఈ ఉత్స‌వాల్లో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తి అయిన శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు వివిధ వాహ‌నాల‌పై ఆల‌య నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు దివ్య‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

బ్ర‌హ్మోత్స‌వ వాహ‌న‌సేవ‌లకు విచ్చేసే భ‌క్తులకు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తిచేసింది. భ‌క్తులంద‌రికి ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీ‌వారి వాహ‌న సేవ‌ల‌తో పాటు మూల‌విరాట్ ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు టీటీడీలోని అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ సాయంత్రం 6.30 నుండి రాత్రి 11 గంటల‌ వరకూ జరుగుతోంది. ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా రంగ‌వ‌ల్లులు తీర్చిదిద్దారు. గ్యాల‌రీల‌లో వేచివుండే భ‌క్తుల సౌక‌ర్యార్థం తాగునీరు, మ‌రుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. భ‌క్తులు మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారీకేడ్లు, క్యూలైన్ల గేట్లు పటిష్టంగా ఏర్పాటు చేశారు.

ఇవాళ ధ్వజారోహణం

ఇవాళ సాయంత్రం 5.45 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ తరువాత రాత్రి 9 నుండి 11 గంటల వ‌ర‌కు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది.

Share this post with your friends
Exit mobile version