
మన దేశంలో ఎన్నో కులాలు, మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. పలు సందర్భాల్లో మత సామరస్యాన్ని గురించి తెలిపే ఘటనల గురించి కూడా మనం వింటూనే ఉన్నాం… చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వార్త ఈ కోవకు చెందినదే. ఓ ఆలయంలో హిందువులు కాదు.. ముస్లింలు పూజాధి కార్యక్రమాలను అనుసరిస్తూ ఉంటారు. ఇక్కడ ముస్లింలు నిత్యం హనుమంతుడిని ఆరాధిస్తూ పూజిస్తారు. ఇది ఈనాటి సంప్రదాయం కాదు.. దాదాపు 150 సంవత్సరాలుగా.. ముస్లిం పూజారులు మాత్రమే ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు.
ఇంతకీ ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు పూజించే హనుమంతుడి ఆలయం ఎక్కడ ఉంది? దాని విశేషాలేంటో తెలుసుకుందాం. ఈ ఆలయం కర్ణాటకలోని గడగ్ జిల్లా కొరికొప్ప అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో కొలువైన ఆంజనేయుడిని లక్ష్మేశ్వర హనుమంతుడి ఆలయంగా పేర్కొంటారు. ఈ ఆలయంలో హనుమంతుడిని హిందూ, ముస్లింలు కలిసి పూజిస్తారు. ఇక్కడ హనుమంతుడు తమను కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని ప్రజల నమ్మకం. అయితే ఇక్కడ పూజ నిర్వహించేది మాత్రం ముస్లింలు మాత్రమే కావడం విశేషం. ఇక్కడి హనుమంతుడిని సంకటమోచనుడిగా భావించి ప్రజలు పూజలు నిర్వహిస్తారు.
