
ప్రతి ఏడాది ఫాల్గుణ పౌర్ణమి నాడు మనం హోలీ పండుగను జరుపుకుంటాం. ఈ క్రమంలోనే దేశమంతా నేడు హోలీ వేడుకను జరుపుకుంటోంది. రాత్రి హోలికా దహనం దేశమంతా అత్యతం వైభవంగా నిర్వహించింది. దీని వెనుకున్న కథేంటో తెలుసుకుందాం. హోలీ పండుగను పలు పేర్లతో పిలుస్తారు. హోళికా పూర్ణిమ అని, కాముని పున్నమి అని కూడా అంటారు. ఇవాళ హోలీ మాత్రమే కాదు.. లక్ష్మీదేవి జయంతి కూడా కావడం విశేషం. శ్రీ మహాలక్ష్మి ఈ రోజునే క్షీరసాగరం నుంచి ఉద్బవించిందట. పెద్దలు కూడా పిల్లలుగా మారిపోయే ఈ హోలీ పండుగ జరుపుకోవడం వెనుక ఓ పురాణగాథ ఉంది. హిరణ్యకశ్యపుడి కథ గురించి అందరికీ తెలిసిందే. విష్ణు ద్వేషి అయిన హిరణ్యకశ్యపుడికి పరమ విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు అనే కుమారుడు ఉండేవాడు.
తన కుమారుడిని విష్ణు భక్తి నుంచి మరల్చడానికి హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని ఎన్నో హింసలకు గురి చేస్తాడు. అయినా సరే.. ప్రహ్లాదుడు ఏమాత్రం మారలేదు. హిరణ్యకశ్యపునికి హోళికా అనే సోదరి ఉండేది. ఆమెకు ఓ వరం ఉండేది. దాని కారణంగా ఆమెకు అగ్ని కారణంగా ఎలాంటి ప్రమాదమూ వాటిల్లేది కాదు. ఇదే అవకాశంగా భావించిన హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని తన ఒళ్లో కూర్చోబెట్టుకొని అగ్ని ప్రవేశం చేయమని తన సోదరిని ఆజ్ఞాపిస్తాడు. తద్వారా ప్రహ్లాదుడు మరణిస్తాడని భావిస్తాడు. హిరణ్యకశ్యపుడు చెప్పినట్టుగా ప్రహ్లాదుడిని హోలికా ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్ని ప్రవేశం చేస్తుంది. ప్రహ్లాదుడిని శ్రీమహావిష్ణువు కాపాడుకుంటాడు. హోలికా అగ్నిలో దహనమవుతుంది. ఇందుకు సంకేతంగానే హోలీ ముందు రోజు రాత్రి హోళికా దహనం చేస్తారు.
