
శ్రీకృష్ణ జన్మాష్టమి మరో రెండు రోజుల్లో రానుంది. ఈ పండుగను దేశమంతా హిందువులు పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారు. ఈ జన్మాష్టమి రోజున ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వారిని అందంగా అలంకరిస్తారు. ఈ అలంకరణలో అందంగా బొట్టు తలపై నెమలి పింఛం పెడతారు. ఎందుకంటే శ్రీకృష్ణుడికి సంబంధించిన ఏ చిత్ర పటాన్ని పరిశీలించినా కూడా మనకు నెమలి ఈకతోనే దర్శనమిస్తాడు. అసలు కన్నయ్య ఎందుకు నెమలి ఈకను ధరిస్తాడో తెలుసా? దీనికి ఓ కారణముంది. అదేంటంటే.. రాధాకృష్ణుల ప్రేమ గురించి అందరికీ తెలిసిందే.
ఇప్పటికీ ప్రేమ అనగానే గుర్తొచ్చేది రాధాకృష్ణులే. వీరి ప్రేమ అనంతమని చెబుతుంటారు. ఈ రాధపై ఉన్న ప్రేమకు గుర్తుగా కన్నయ్య నెమలి పింఛాన్ని ధరిస్తాడట. అప్పట్లో రాధ నివాసంలో భారీగా నెమళ్లు ఉండేవట. ఒకసారి ఆమె ఇంటికి వెళ్లిన కన్నయ్య వేణువు వాయిస్తుండగా.. రాధ నృత్యం చేస్తోందట. ఆ సమయంలో అక్కడే ఉన్న నెమళ్లు సైతం కన్నయ్య వేణుగానానికి పరవశించిపోయి నాట్యం చేశాయట. అప్పుడు ఓ నెమలి నుంచి ఈక కింద పడిందట. దానిని కృష్ణుడు తలలో ధరించాడట. ఇక అప్పటి నుంచి రాధపై ప్రేమకు గుర్తుగా కన్నయ్య నెమలి ఈకను ధరించేవాడట.
