
శ్రీకృష్ణ జన్మాష్టమిని అత్యంత వైభవంగా జరుపుకునేందుకు దేశంలోని ప్రజలంతా సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఈ పండుగను నార్త్‌లో చాలా బాగా చేస్తారు. మధురలో ఒకలా.. బృందావన్‌లో మరోలా చేస్తారు. మరి శ్రీ కృష్ణుడు ఏలిన నగరమైన ద్వారకలోఎలా చేస్తారో తెలుసా? అన్ని ప్రాంతాల కంటే భిన్నంగా చేస్తారు. ఇప్పటికే ద్వారకలో అలంకరణ పూర్తైంది. కృష్ణాష్టమి వేడుకల కోసం సుందరంగా ముస్తాబైంది. గుజరాత్‌లో ఉందీ ద్వారక. ఇక్కడకు కృష్ణాష్టమి పండుగ సందర్భంగా దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక కృష్ణాష్టమి రోజున కన్నయ్యను విలువైన ఆభరణాలతో అలంకరిస్తారు.
రాత్రి వేళలో కన్నయ్యకు ఈ అలంకరణ కార్యక్రమం ఉంటుంది.అలంకరణ పూర్తైన అరగంటకు నైవేద్యం సమర్పిస్తారు. కానీ ఈ కార్యక్రమాలన్నింటికీ భక్తులకు అనుమతి లేదు. రాత్రి 12 గంటలకు కన్నయ్యకు ఘన స్వాగతం పలికి.. ఆ తర్వాత రాత్రి 2 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. ఇక ఉదయం 7 గంటలకు హారతి అనంతరం కన్నయ్యకు భోగ్ సమర్పించి తెరను తొలగిస్తారు. అప్పుడు భక్తులకు దర్శనం లభిస్తుంది. ఇక ఇక్కడ ఎన్నో రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. దహీ హండీ, జాయ్ రైడ్‌ల సహా ఎన్నో రకాల ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. కృష్ణాష్టమి రోజున ద్వారకకు వెళ్లిన భక్తులు ఓ మధురానుభూతితో తిరిగి వస్తారు.
