శ్రీకృష్ణుడు తన విరాట్ స్వరూపాన్ని చూడడానికి దివ్యదృష్టి ఇచ్చాడట. దివ్యదృష్టి అంటే అదేదో ఒక త్రీడీ అద్దాలలాంటిది కాదు. భగవంతుని గురించి సూక్ష్మంగా ఆలోచించగలిగిన మనసునే ఈ దివ్యదృష్టిగా అభివర్ణించారు. ప్రపంచాన్ని ప్రపంచంగా, శత్రువులు, మిత్రులుగా కాకుండా భగవంతుని స్వరూపంలో చూడడమే దివ్యదృష్టి. ఈ రూపంలో అతడు చూసినదేమిటి? బ్రహ్మ, రుద్రులు, ఆదిత్యులు మొదలైన దేవుళ్లనంతా. వీరంతా వేర్వేరు వ్యక్తులు కారు. అందరూ మహావిష్ణువులోని వారే. నిరంతరం జరుగుతున్న లయమే రుద్రుడు. దీనిలోనే అనేకమైన కోరలతో వికృతమైన నోళ్లతో భీష్ముడు, ద్రోణుడు మొదలైనవారు ప్రవేశిస్తున్నారట.
భయంకరమైన కోరలతో కొందరి తలలు నలుగుతున్నాయట. అర్జునుడే ఆ రూపాన్ని చూసి కంపించిపోయాడు. నీ స్వరూపమేమిటని ప్రశ్నించాడు. నేను కాలస్వరూపుణ్ని అన్నాడు కృష్ణుడు. కాలప్రవాహంలో రాజ్యాలు, రాజులు అన్నీ సమసిపోతుంటాయి. గ్రీకు పురాణాల ప్రకారం కాలపురుషుడు ఒక రెక్కల రథంపై గొప్ప కొడవలి తీసుకుని లోకాన్ని నరుక్కుంటూ వెళ్తుంటాడు. అలాంటి కాలస్వరూపాన్నే ఇక్కడ అర్జునుడు చూస్తాడు. కృష్ణుడు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతాడు. భీష్ముడు, కర్ణుడు మొదలైనవారంతా ఇప్పటికే నాచే చంపబడ్డారు. నీవు లేకున్నా వీరందరూ మరణించడం జరుగుతుంది. నీవు కేవలం నిమిత్తమాత్రుడుగా విల్లంబులు పట్టుకుని యుద్ధం చేయి. వీళ్లందరినీ జయించి కీర్తిపొందు అని అన్నాడు.
దీనిలో ఒక శాశ్వతమైన సత్యం ఉంది. ప్రపంచంలో ధర్మానికీ, అధర్మానికీ ఘర్షణ నడుస్తూనే ఉంటుంది. సత్వము, రజస్సు, తమస్సు పోటీపడి బలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. ఒక్కొక్కసారి మంచివాళ్లు హింసకు గురవుతుంటారు. దుర్మార్గులు లాభం పొందుతుంటారు. ధర్మానికి తీవ్రమైన గ్లాని ఏర్పడినపుడు మనిషి రూపంలోనే మళ్లీ ధర్మాన్ని ప్రతిష్ఠించే ప్రక్రియ సృష్టిలో ఉంది. ఈ ప్రక్రియను చూడటమే విశ్వరూప దర్శనం.
